UseTelugu.com – తెలుగు వాడండి

కమ్మని కాఫీ లాంటి తెలుగు .. మనసార ఆస్వాదించండి

అన్నమాచార్య కీర్తనలు (Annamaachaarya Keertanas)

April 4, 2015 by admin | 0 comments

annamayyaఅదివో అల్లదివో 

రాగం: మధ్యమావతి రాగం
తాళం: ఆది తాళం

పల్లవి:
అదివో అల్లదివో శ్రీహరివాసము
పదివేల శేషుల పడగలమయము
॥అదివో॥

చరణం1:
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్య నివాస మఖిలమునులకు
అదే చూడుడు, అదే మ్రొక్కుడు
అదే చూడుడదే మ్రొక్కుడానందమయము
॥అదివో॥

చరణం2:
చెంగటనల్లదివో శేషాచలము
నింగినున్న దేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్న ధనము
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
॥అదివో॥

చరణం3:
కైవల్యపదము వేంకటనగమదివో
శ్రీవేంకటాపతికి సిరులైనవి
భావింప సకల సంపదరూప మదివో
పావనములకెల్ల పావనమయము
॥అదివో॥


 

కొండలలో నెలకొన్న… 

పల్లవి
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు….
॥కొండలలో॥

చరణం1:
కుమ్మర దాసుడైన కురువరతినంబి
యిమ్మన్న వరములెల్ల యిచ్చిన వాడు
దొమ్ములు సేసిన యట్టి తొండ మాన్ చక్కుర వర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు..
॥కొండలలో॥

చరణం2:
అచ్చపు వేడుకతోడ అనంతాళు వారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోచిన వాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చిన వాడు..
॥కొండలలో॥

చరణం3:
కంచిలోనుండ తిరుకచ్చినంబి మీద
కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలను
మంచివాడై కరుణ పాలించినవాడు
॥కొండలలో॥


 

ముద్దుగారే యశోద …

పల్లవి
ముద్దు గారే యశోద ముంగిట ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకీ సుతుడు
॥ముద్దు॥

చరణం1:
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడపచ్చా పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు
॥ముద్దు॥

చరణం2:
రతికేళి రుఖ్మినికి రంగుమోవి పగడము
మితి గోవర్ధనపు గోమేధికము
సతమై శంఖచక్రాల సందుల వైదూర్యము
గతియై మమ్ము గాచే కమలాక్షుడు
॥ముద్దు॥

చరణం3:
కాళింగుని తలలాపై గప్పిన పుష్యరాగము
యేలేటి శ్రీ వేంకటాద్రి ఇంద్రనీలము
పాలజలనిధిలోన బాయని దివ్య రత్నము
బాలునీవలె దిరిగే పద్మనాభుడు
॥ముద్దు॥


తందనాన … 

తందనాన అహి – తందనాన పురె
తందనాన భళా – తందనాన
॥తందనాన॥
బ్రహ్మమొక్కటె పర – బ్రహ్మమొక్కట
పరబ్రహ్మమొక్కటె పర బ్రహ్మమొక్కటె

॥తందనాన॥

కందువగు హీనాధికములిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతానొక్కటె
అందరికి శ్రీహరే అంతరాత్మ
॥తందనాన॥
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటె
చండాలు డుండేటి సరిభూమి యొకటే
॥తందనాన॥
కడగి యేనుగు మీద కాయు యెండొకటే
పుడమి శునకము మీద బొలయు యెండొకటే
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ
జడియు శ్రీ వేంకటేశ్వరుని నామమొకటె
॥తందనాన॥


 

బ్రహ్మకడిగిన … 

బ్రహ్మగడిగిన పాదము
బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మగడిగిన పాదము

॥బ్రహ్మ॥

చెలగి వసుధ గొలిచిన దీ పాదము బలి తల మోపిన పాదము
తలకక గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము
॥బ్రహ్మ॥
కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము
ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదముపామిడి తురగపు పాదము
॥బ్రహ్మ॥
పరమ యోగులకు పరిపరి విధముల వర మొసగెడి నీ పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపినపరమ పదము నీ పాదము
॥బ్రహ్మ॥

అష్టాదశ పురాణాలు (Puraanas)

April 4, 2015 by admin | 0 comments

Dasavataraవ్యాసభగవానుడు రచించిన 18 పురాణాల పేర్లను ఈ క్రింది శ్లోకమందు కూర్చబదినవి.

మద్వయం భద్వయం చైవ 
బ్రత్రయం వచతుష్టయమ్ 
అనాపలింగ కూస్కాని 
పురాణాని ప్రచక్షత

మద్వయం : మ కారంతో 2. అవి మత్స్య పురాణం, మార్కండేయ పురాణం.
భద్వయం : భ  కారంతో 2. అవి భాగవత పురాణం, భవిష్యత్  పురాణం.
బ్రత్రయం : బ్ర  కారంతో 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం.
వచతుష్టయం : వ  కారంతో 4. అవి వాయు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం.
  కారంతో అగ్ని  పురాణం, నా  కారంతో నారద పురాణం, కారంతో పద్మ పురాణం, లిం కారంతో లింగ పురాణం, కారంతో గరుడ పురాణం,
కూ  కారంతో కూర్మ పురాణం, మరియు స్క  కారంతో స్కంద పురాణం రచించిరి.

1. మత్స్య పురాణం :
దీనిలో 14000 శ్లోకములు ఉన్నవి. మత్స్య అవతారమెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. యయాతి, సావిత్రుల చరిత్రలు, ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్షేత్ర మహాత్మ్యములు చెప్పబడినవి. 

2. మార్కండేయ పురాణము : (1,2,3,4,5,6,7,8,9)
ఇందులో 9000 శ్లోకములు కలవు. మార్కండేయ మహర్షిచే చెప్పబడినది. శివవిష్ణువుల మహాత్మ్యములు, ఇంద్ర, అగ్ని, సూర్యుల మహాత్మ్యములు మరియు సప్తశతి (లేక దేవీ మహాత్మ్యము) చెప్పబడినవి. చండి హోమము, శతచండీ సహస్ర చండీ  హోమ విధానమునకు ఆధారమైనది ఏ సప్తశతియే. 

3. భాగవత పురాణము :
దీనిలో 18,000 శ్లోకాలు కలవు. వేద వ్యాసుని వలన శకునకు, శుకుని వలన పరీక్షిత్ మహారాజునకు 12 స్కందములలో మహా విష్ణు అవతారాలు శ్రీ కృష్ణ జనన, లీలాచరితాలు వివరింపబడినవి. 

4. భవిష్య పురాణము :
దీనిలో 14,500 శ్లోకాలు కలవు. సూర్య భగవానునిచే మనువునకు సూర్యోపాసన విధి, అగ్ని దేవతారాధన విధానం, వర్ణాశ్రమ ధర్మాలు వివరింపబడినవి. ముఖ్యంగా భవిష్యత్ అనగా రాబోవు కాలం, భవిష్యత్తులో జరుగబోవు వివరణ ఇందు తెలుపబదినది. 

5. బ్రహ్మ పురాణము :
దీనినే ఆదిపురాణం లేక సూర్యపురాణం అందురు. దీనిలో 10,000 శ్లొకాలున్నవి. బ్రహ్మచే దక్షునకు శ్రీకృష్ణ, మార్కండేయ, కశ్యపుల చరిత్ర వర్ణనలు, వర్ణధర్మాలు, ధర్మాచరణాలు, స్వర్గ-నరకాలను గూర్చి వివరించబడినవి. 

6. బ్రహ్మాండ పురాణము :
దీనిలో 12,000 శ్లోకాలు కలవు. ఈ పురాణం బ్రహ్మచే మరీచికి చెప్పబడినది. రాధాదేవి, శ్రీకృష్ణుడు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీ లలితా సహస్ర నామస్తోత్రాలు, శివకృష్ణ స్తోత్రాలు, గాంధర్వం, ఖగోళశాస్త్రం మరియు స్వర్గ నరకాలు వివరణ ఇందు వివరించబడినది.

7. బ్రహ్మ వైవర్త పురాణము :
దీనిలో 18,000 శ్లోకములు కలవు. సావర్ణునిచే నారదునకు చెప్పబడినది. స్కంద, గణేశ, రుద్ర శ్రీకృష్ణుల వైభవములు, సృష్టికర్త బ్రహ్మ, సృష్టికి కారణమయిన భౌతిక జగత్తు (ప్రకృతి ) మరియు దుర్గా, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలగు పంచ శక్తుల ప్రభావము గురించి వివరించబడినది. 

8. వరాహ పురాణము :
దీనిలో 24,000 శ్లోకములు , వరాహ అవతారమెత్తిన విష్ణువుచే భూదేవికి చెప్పబడినది. విష్ణుమూర్తి ఉపాసన విధానము ఎక్కువగా కలదు. పరమేశ్వరీ, పరమేశ్వరుల చరిత్రలు, ధర్మశాస్త్రము, వ్రతకల్పములు, పుణ్య క్షేత్రవర్ణనలు ఈ పురాణములో కలవు. 

9.వామన పురాణము :
దీనిలో 10,000 శ్లోకములు కలవు. పులస్త్య ఋషి నారద మహర్షికి ఉపదేశించినది. శివలింగ ఉపాసన, శివపార్వతుల కల్యాణము, శివగణేశ, కార్తికేయ చరిత్రలు, భూగోళము – ఋతు వర్ణనలు వివరిచబదినవి. 

10.వాయు పురాణము :
దీనిలో 24,000 శ్లోకములు కలవు. ఇది వాయుదేవునిచే చెప్పబడినది. శివభ్హగవానుని మహాత్మ్యము, కాలమానము, భూగోళము, సౌరమండల వర్ణనము చెప్పబడినది. 

11.విష్ణు పురాణము :
దీనిలో 23,000 శ్లోకములు కలవు. పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి భొధించినది. విష్ణు మహాత్మ్యము, శ్రీకృష్ణ, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరిత్రలు వర్ణింపబడినవి. 

12.అగ్నిపురాణము :
దీనిలో 15,400 శ్లోకములు కలవు. అగ్ని భగవానునిచే వషిష్టునకు శివ, గణేశ, దుర్గా భగవదుపాసన, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, లౌకిక ధర్మములు, రాజకీయము, భూగోళ ఖగోళ శాస్త్రాలు, జ్యోతిషం మొదలగు విషయాలు చెప్పబడినవి.

13.నారద పురాణము :
ఇందు 25,000 శ్లోకములు కలవు. నారదుడు సనక, సనందన, సనత్కుమార, సనాతన అను నలుగురు బ్రహ్మమానసపుత్రులకు చెప్పినది. అతి ప్రసిద్ది చెందిన వేదపాదస్తవము (శివస్తోత్రము ) ఇందు కలదు. వేదాంగములు, వ్రతములు, బదరీ , ప్రయాగ, వారణాసి క్షేత్ర వర్ణనలు కలవు. 

14.స్కంద పురాణము :
దీనిలో 81,000  శ్లోకములు కలవు. ఇది కుమారస్వామి (స్కందుడు) చే చెప్పబడినది. ఇందు ముఖ్యముగా శివచరిత్ర వర్ణననలు, స్కందుని మహాత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీఖండము, కేదారఖండము, రేవా ఖండము, (సత్యనారాయణ వ్రతము ఇందులోనివే), వైష్ణవ ఖండము (వేంకటాచల క్షేత్రము), ఉత్కళ ఖండము (జగన్నాథ క్షేత్రము), కుమారికా ఖండము (అరుణాచల క్షేత్రము), బ్రహ్మ ఖండము (రామేశ్వర క్షేత్రము), బ్రహ్మోత్తర ఖండము (గోకర్ణ క్షేత్రము, ప్రదోష పూజ), అవంతికా ఖండము (క్షీప్రానదీ, మహాకాల మహాత్మ్యము) మొదలగునవి కలవు. 

15.లింగ పురాణము :
ఇది శివుని ఉపదేశములు. లింగరూప శివ మహిమ, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు, ఖగోళ, జ్యోతిష, భూగోళ శాస్త్రములు వివరించబడినవి. 

16.గరుడ పురాణము :
ఇందు 19,000 శ్లోకములున్నవి. ఇది విష్ణువుచే గరుత్మంతునకు ఉపదేశించబడినది. శ్రీ మహావిష్ణు ఉపాసన, గరుత్మంతుని ఆవిర్భావము, జనన మరణములు, జీవి యొక్క స్వర్గ – నరక ప్రయాణములు తెలుపబడినవి. 

17.కూర్మ పురాణము :
ఇందు 17,000 శ్లోకములున్నవి. కూర్మావతార మెత్తి విష్ణువుచే చెప్పబడినది. వరాహ నారసింహ అవతారములు, లింగరూప శివారాధన, ఖగోళము, భోగోళముథో వారణాసి, ప్రయాగక్షేత్ర వర్ణనలు తెలుపబడినవి. 

18.పద్మ పురాణము :
ఇందులో జన్మాంతరాలనుండి చేసిన పాపాలను, కేవలం వినినంత మాత్రముననే పోగొట్టగలిగేది ఈ పద్మపురాణము. అష్టాదశ పురాణాలలో కెల్ల అత్యధిక శ్లోకాలు కల్గినది పద్మ పురాణము. 85,000 శ్లోకములతో పద్మకల్పమున జరిగిన విశేషాలను మనకు తెలియజేస్తుంది. మరియు మధుకైతభావధ, బ్రహ్మ సృష్టికార్యము, గీతార్థసారం – పఠన మహత్మ్యం, గంగామహాత్మ్యం, పద్మగంధి దివ్యగాధ, గాయత్రీ చరితము, రావివృక్షమహిమ, విభూతి మహాత్మ్యం, పూజా విధులు – విధానం, భగవంతుని సన్నిధిలో ఏ విధంగా ప్రవర్తించాలో పద్మపురాణంలో వివరంగా తెలియజేయబడినది. 

ఈ విధముగా పురాణములందలి విషయములు క్రమముగా సంక్షిప్త రూపమున వేద వ్యాస పీఠ మందిరము నందు రచింపబడి నైమిశారణ్యమునందు ప్రసిద్దములైయున్నవి.